చలికాలం - ఆహార జాగ్రత్తలు!

చలికాలం - ఆహార జాగ్రత్తలు!

👉చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీ కోసం వివరిస్తున్నాము.

👉చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.

👉మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.

👉ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

👉మొలకెత్తిన గింజలు ఈ సీజన్‌లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.

👉ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

👉నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్‌లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.

👉శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.

👉వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.

👉వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.

👉కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయలేక చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారు కొంత సమయం ఎండలో నడవడం మంచిది. 

👉పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.

👉వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

👉పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది. 

👉ఈ కాలంలో శరీరం పొడిబారడం, కాళ్ళు పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి కాళ్లకు రాసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

👉తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి.

Comments