Skip to main content
Symptoms of heart attack and remedies
గుండెపోటు:
అప్పటి వరకూ చురుకుగా పని చేసిన మనిషి.. హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవటం.
కుటుంబ సభ్యులో, స్నేహితులో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే.. మనకు దక్కకుండా పోవటం... తరచూ వినిపిస్తున్న వార్తే ఇది! వ్యక్తులు మారొచ్చు.. సందర్భాలు మారొచ్చుగానీ.. ఈ వార్త మాత్రం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. గుండె.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఎందుకు జారేస్తోంది? దీన్ని ఎదుర్కొనేదెలా...? ఇది ప్రాణప్రదమైన ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే ప్రశ్న. సమాధానం తెలిస్తే ఆ క్లిష్ట సమయంలో కూడా.. ఆపన్నహస్తం అందించొచ్చు. అందుకే 'సడన్ కార్డియాక్ డెత్'... 'సడెన్ కార్డియాక్ అరెస్ట్'... వీటికి సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం.
హఠాన్మరణం ఎవరిలో ఎక్కువ?
* గతంలో ఒకసారి గుండెపోటు బారినపడిన వారు
* గుండె కండరం బలహీనంగా ఉన్నవారు.
* రక్తం పంపింగ్ (ఈఎఫ్) 35 కంటే తక్కువ ఉన్నవారు
* కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు
* కుటుంబంలో గుండెలో విద్యుత్ సమస్యలు (బ్రుగాడా, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ మొ.) ఉన్నవారు
* గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు
హఠాత్తుగా గుండె ఆగి మరణించటం... సడెన్ కార్డియాక్ డెత్.. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం.. ప్రతి ఘడియా కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్న వారిలో రావచ్చు.... ఇప్పటి వరకూ ఎటువంటి గుండె జబ్బూ ఉన్నట్టు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే... ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే.. అవగాహనతో స్పందిస్తే.. మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
గుండె ఆగి హఠాన్మరణం సంభవించటమన్నది... సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్లు, తీవ్ర గుండె వైఫల్యం ఉన్నవాళ్లు, గుండె నిర్మాణంలో లోపాలున్న వారిలో ఎక్కువ. అయితే వీరే కాదు.. గుండెపోటు వచ్చే రిస్కులు ఉన్నవారిలోనూ ఇది సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన అంశమేమంటే- ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులున్న వారిలో హఠాన్మరణం పాలయ్యే వారి శాతం ఎక్కువ. వీరితో పోలిస్తే... కేవలం హైబీపీ, హైకొలెస్ట్రాల్, మధుమేహం, పొగతాగే అలవాటు వంటి గుండె పోటు రిస్కులున్న వారిలో హఠాన్మరణం సంభవించటమన్నది శాతాలపరంగా తక్కువగానే ఉండొచ్చు. కానీ సమాజం మొత్తం మీద సంఖ్యాపరంగా చూసినప్పుడు... మన సమాజంలో తీవ్రమైన గుండె జబ్బులుండి ఇలా హఠాన్మరణం పాలయ్యే వారికంటే కూడా ఈ గుండెపోటు రిస్కులుండి హఠాన్మరణం పాలయ్యే వారి సంఖ్యే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందుకే... హఠాత్తుగా గుండె ఆగి మరణించే వారి సంఖ్యను తగ్గించాలంటే గుండెపోటు రిస్కుల విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరం.
రిస్కులు కలిసిన కొద్దీ.. పెద్ద రిస్కు!
నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.
గుండెపోటు లేకుండానూ:చాలామంది హఠాత్తుగా* గుండె ఆగి మరణించటానికి ప్రధాన కారణం గుండె పోటే. గుండె పోటు లేకుండా కూడా కొందరిలో ఇటువంటి హఠాన్మరణం సంభవించవచ్చుగానీ..* వీరిలో పుట్టుకతోనే గుండె లోపాలుండటమో, లేక గుండె కండరం మందంగా (హైపర్‌ట్రోఫీ కార్డియోమయోపతీ) ఉండటం వంటి లోపాలు ఉండి ఉండొచ్చు. లేకపోతే గుండెలోపల విద్యుత్తు ప్రవాహం దెబ్బతినొచ్చు. మామూలుగా మన గుండెలో విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఈ విద్యుత్తు ప్రకంపనాలు తరంగాల మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే గుండె సక్రమంగా కొట్టుకుంటుంది. కానీ ఇవన్నీ ఒక్కసారిగా కట్టకట్టుకొని (వెంట్రికల్ టెకీకార్డియా) ప్రసారమైతే.. గుండె లయ విపరీతమైన వేగాన్ని అందుకుని.. అది అస్తవ్యస్తంగా కొట్టుకోవటం ఆరంభిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు ఎలాంటి విద్యుత్తు ప్రకంపనాలు సమయానికి చేరుకోకపోయినా (వెంట్రికల్ ఫిబ్రిలేషన్) గుండె కొట్టుకునే తీరు అస్తవ్యస్తం కావొచ్చు. గుండె కండరంలో విద్యుత్తు ప్రసార వ్యవస్థలో ఎక్కడ అవాంతరం తలెత్తినా.. ఇలాంటి అస్తవ్యస్త స్థితి తలెత్తి.. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవచ్చు. ఇలాంటి విద్యుత్ ప్రసార సమస్యలన్నింటినీ కలిపి 'ఛానెలోపతీ' అంటారు. 'లాంగ్ క్యూటీ సిండ్రోమ్, 'బ్రుగాడా సిండ్రోమ్' వంటివి దీనికి కారణమవుతుంటాయి. కారణమేదైనా గుండె లయ అస్తవ్యస్తమై.. కొన్ని సెకన్ల పాటు గుండె సమర్థంగా పని చేయకపోతే మెదడుకు రక్తప్రసారం దెబ్బతిని వెంటనే వ్యక్తి స్పృహ కోల్పోతాడు. కొద్ది నిమిషాలు ఇలాగే కొనసాగితే మరణించే ప్రమాదముంటుంది. ఇవన్నీ గుండె పోటుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటానికి కారణమవుతున్నాయి. ఇవి కొన్ని కుటుంబాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. దగ్గరి రక్తసంబంధికుల్లో ఎవరికైనా ఈ సమస్యలుంటే ఆ కుటుంబంలో మిగతా వారిలోనూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో ఎవరైనా ముఖ్యంగా 45 ఏళ్ల లోపువాళ్లు హఠాత్తుగా గుండె ఆగి చనిపోతే.. ఆ కుటుంబంలోని మిగతా వాళ్లూ ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. వీటిని ఈసీజీ, 2డీ ఎకోగ్రామ్ వంటి పరీక్షల ద్వారా గుర్తించే వీలుంటుంది. సరైన చికిత్స తీసుకుంటే హఠాన్మరణాన్ని నివారించే వీలూ ఉంటుంది.
పెద్ద ముప్పు.. గుండెపోటు:గుండెపోటు వచ్చి చనిపోయేవారిలో.. దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు వచ్చినవారిలో మరణాల రేటు 16-17% ఉండేది. వీరిలో చాలామంది ఆసుపత్రి కూడా చేరక ముందే, ఇంటివద్దో, దారిలోనో చనిపోతుండేవారు. ఇప్పుడున్న అత్యాధునిక చికిత్సలతో ఆసుపత్రికి వచ్చినవారిలో ఈ మరణాల రేటును 7-8 శాతానికి తీసుకురాగలిగాం. ఆసుపత్రికి చేరనివారిలో మరణాలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. గుండెపోటు లక్షణాలు కనిపించిన తర్వాత వాటిని గుర్తించటం ఒక ఎత్తయితే.. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రి చేరటం మరోఎత్తు. దీని విషయంలో అవగాహన చాలా అవసరం. గణాంకాలు చూస్తే- గుండెపోటు మూలంగా సంభవించే అధిక శాతం మరణాలు మొదటి అర గంటలోనే సంభవిస్తున్నాయి. కొన్ని మొదటి 1, 2 నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. తర్వాత అర గంటలో ఎక్కువ. కాబట్టి త్వరగా స్పందించటం ముఖ్యం.
తాత్సారం వద్దు:హఠాన్మరణానికి దారితీసే అతిపెద్ద సమస్య హఠాత్తుగా వచ్చే గుండెపోటు. కాబట్టి గుండెపోటు రాకుండా చూసుకునే మార్గాలన్నీ.. హాఠాత్తుగా గుండె ఆగి సంభవించే మరణాలను తగ్గించగలిగేవే. అందుకే దీనిపై మరింత శ్రద్ధపెట్టాలి. గుండె నొప్పి అని అనుమానం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చెయ్యకూడదు. కొందరు ఈ కీలక ఘడియల్లోనూ తాత్సారం చేస్తుంటారు. వైద్యులు బలమైన అనుమానం ఉందని చెప్పినా ఏమీ లేదని అపోహలు పడుతూ తోసేసుకు తిరగటం, లేదా రకరకాల ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి చేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. గుండె పోటును- గుండె నొప్పి లక్షణాలు, వ్యక్తికి ఉన్న ఇతరత్రా రిస్కులు, ఈసీజీ వంటివన్నీ చూసి నిర్ధారిస్తారు. ఉదాహరణకు చిన్నవయసు అమ్మాయి గుండెలో నొప్పి అని వస్తే వెంటనే గుండెపోటును అనుమానించకపోవచ్చు. కానీ అదే 60 ఏళ్ల వ్యక్తి వచ్చి అదే లక్షణాలు చెబితే.. అప్పటికే అతనికి మధుమేహం, హైబీపీ, పొగతాగే అలవాటు వంటివి ఉంటే.. నొప్పి తీవ్రత తక్కువగా ఉన్నా వెంటనే అనుమానించటం అవసరం. దీన్నే 'ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ' అంటారు.
కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని 'గ్యాస్ ప్రాబ్లమ్'గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి... వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.
నివారణ ముఖ్యం:అసలు గుండెపోటు అన్నదే రాకుండా నివారించుకోవటం అత్యుత్తమం. అందుకు ఉప్పు తక్కువ తినటం, పండ్లు ఎక్కువ తినటం, నిత్యం వ్యాయామం చెయ్యటం, బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం ఉందేమో పరీక్షలు చేయించుకోవటం... ఇవన్నీ ముఖ్యం. వీటిని పాటించటం ద్వారా చాలా మట్టుకు హఠాన్మరణాలు రాకుండా చూసుకోవచ్చు. వీటితో హఠాన్మరణాలు చాలా వరకూ తగ్గాయని వివిధ దేశాల అనుభవాలు, అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఒకసారి గుండెపోటు వస్తే?
హఠాత్తుగా గుండె ఆగి మరణించటమన్నది ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న వారిలో చాలా ఎక్కువ. ఎందుకో చూద్దాం. ఇప్పటికే ఒకసారి తీవ్రమైన గుండెపోటు వస్తే.. గుండె కండరంలో కొంత భాగం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చికిత్స ఎంత జాప్యమైతే గుండె కండరం అంత దెబ్బతింటుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత త్వరగా చికిత్స ఇవ్వగలిగితే.. గుండె కండరం అంత తక్కువగా దెబ్బతింటుంది, తర్వాతి కాలంలో హఠాన్మరణం సంభవించే అవకాశం అంతగా తగ్గిపోతుంది. కండరం బాగా దెబ్బతింటే గుండె రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్- ఈఎఫ్) అన్నది తగ్గుతుంటుంది, అది 35% కంటే తగ్గుతున్న కొద్దీ హఠాత్తుగా గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. గుండెలో కరెంటు తీగలు, గుండె కండరం కలిసి ఉంటాయి. ఒకసారి గుండెపోటు వస్తే గుండె కండరంలో కొంతభాగం దెబ్బతింటుంది, అది చచ్చుబడినట్లవుతుంది. దాని మధ్యలో ఈ కరెంటు తీగలు చిక్కుబడినట్లవుతాయి. దీంతో కరెంటు షార్ట్‌సర్క్యూట్ అయినట్లయి... అక్కడక్కడే తిరుగుతుంటుంది, దీంతో గుండె మామూలుగా నిమిషానికి 80 సార్లు కొట్టుకోవాల్సింది... 200, 300 సార్లు కొట్టుకుంటుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ, కాబట్టి లయలు అస్తవ్యస్తమై (వీటీ, వీఎఫ్) హఠాత్తుగా మరణం ముంచుకొచ్చే ప్రమాదం ఎక్కువని గుర్తించాలి. కాబట్టి ఒకసారి గుండెపోటు వస్తే- వెంటనే వైద్యులు- వారిలో హాఠాత్తుగా మరణం ముంచుకొచ్చే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్నది అంచనా వేస్తారు. ఒకవేళ గుండె పంపింగ్ సామర్థ్యం (ఈఎఫ్) తక్కువుండి, ఈసీజీలో మార్పులుండి, గుండె లయలో తేడాలు కనబడుతుంటే భవిష్యత్తులో హఠాన్మరణాలను నివారించేందుకు కొంత ఖరీదైనదే అయినా శరీరంలో 'ఏఐసీడీ' అన్న పరికరం అమర్చుకోవాలని సూచిస్తారు.
దీనితో పాటు.. ఒకసారి గుండెపోటు బారినపడితే.. అది మళ్లీ రాకుండా చూసుకోవటం, వైద్యులు చెప్పినట్టు మందులు, చికిత్స కొనసాగించటం చాలా అవసరం. ఇటీవలే సలీం యూసుఫ్ బృందం 'ప్యూర్ స్టడీ' పేరుతో నిర్వహించిన అధ్యయనంలో- మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత మందులు, చికిత్స సరిగా పాటించటం లేదని తేలింది. గుండెపోటు అన్నది జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిన సమస్య అని ఎట్టిపరిస్థితుల్లోనూ మరువకూడదు.
హఠాన్మరణాన్ని.. గుర్తుపట్టేదెలా?
ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే.. వెంటనే వాళ్లు స్సృహలో ఉన్నారా? లేదా? శ్వాస తీసుకుంటున్నారా? లేదా? గుండె కొట్టుకుంటోందా? లేదా? చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే 'కార్డియాక్ మసాజ్ (సీపీఆర్)' ఇవ్వటం తక్షణావసరం. విదేశాల్లో ఇటువంటి అత్యవసర ఘడియల్లో ఛాతీకి షాక్‌లు ఇచ్చి గుండె తిరిగి పనిచేసేలా చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో డిఫిబ్రిలేటర్ అనే పరికరాలు (ఏఈడీ) ఉంచుతారు. వీటితో గుండె తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయి. సత్వరమే వారిని అత్యవసరంగా మంచి సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రిలో వారికి అవసరమైతే డీసీ షాక్ ఇచ్చి గుండె తిరిగికోలుకునేలా చేస్తారు. ఒకవేళ గుండె కొట్టుకోవటం గాడిలో పడినా.. ఎక్కువ సమయం మెదడుకు రక్తసరఫరా లేకపోతే మనిషి'బ్రెయిన్ డెడ్'గా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారిచేందుకు చల్లటి దుప్పట్లలో (కోల్డ్ బ్లాంకెట్స్) పెట్టి శారీరక ఉష్ణోగ్రతను 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంచటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితో తిరిగి బతికి బట్టకట్టే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత దీర్ఘకాలం చికిత్స ఏమిటన్నది ఆలోచిస్తారు. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్ పెట్టటం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణం పరిస్థితులు తలెత్తకుండా 'ఏఐసీడీఈ' అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు.
సీపీఆర్:
ఎవరెనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టటం ముఖ్యం. వెంటనే 'బాగానే ఉన్నారా?' అని పిలవటం, శ్వాస పీలుస్తున్నారా? లేదా? నాడి కొట్టుకుంటోందా? లేదా? లేదా ఛాతీ మీద చెవి పెట్టుకుని గుండె కొట్టుకుంటోందా? లేదా?.. చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం 'కార్డియాక్ మసాజ్' (సీపీఆర్) చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదు ఇస్తారు.గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. ఆంబులెన్స్ వచ్చే వరకూ రక్త ప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం.
ముందుగా బాధితులను పడుకోబెట్టి.. పక్కనే మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకప్పుడు ఇదే సమయంలో నోటిలో నోరుపెట్టి గాలి ఇవ్వాలనీ చెప్పేవారుగానీ ఇప్పుడది అవసరం లేదని తేలింది. కాబట్టి కేవలం ఛాతీ మీద నొక్కుతూ గుండె తిరిగి కొట్టుకోవటం ఆరంభించేలా చేస్తే చాలు.
పడిపోయిన తర్వాత వేగంగా సీపీఆర్ ఆరంభించటం ముఖ్యం. 5-6 సెకండ్లలో రక్తసరఫరా పునరుద్ధరించకపోతే మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోతుంది. 40 సెకన్లు సరఫరా లేకపోతే వాళ్లు బ్రెయిన్ డెడ్ స్థితిలోకి వెళతారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో వేగంగా పని చేయాల్సి ఉంటుంది.
క్రీడలకు ముందు ఓ ఈసీజీ:
ఎవరైనా క్రీడాకారులుగా, దృఢమైన అథ్లెటిక్ శిక్షణ వంటివాటికి వెళ్లే ముందు ఒక్కసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. పోలీసు, ఎస్సై వంటి పోస్టులకు జరిపే దేహదారుఢ్య పరీక్షల్లో చాలా దూరాలు పరుగులుపెట్టే కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోవటం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలాంటి శారీరక దారుఢ్య పరీక్షలకు వెళ్లినప్పుడు అప్పటికే వీరిలో లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వంటివి ఉంటే ఇలాంటి సమయంలో అవి మరింత సమస్యాత్మకంగా మారి, హఠాత్తుగా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు ఆరంభించే ముందు తప్పనిసరిగా ఈసీజీ పరీక్ష తీయించి, సమస్యేమీ లేదని నిర్ధారించుకోవటం మంచిది. దీనికయ్యే ఖర్చు కూడా పెద్దగా ఉండదు. కొందరు కొంచెం సేపు ఎక్కువ వ్యాయామం చేస్తే కళ్లు తిరిగి పడిపోతుంటారు. వీరు కూడా ఓసారి వైద్యులను సంప్రదించి సమస్యలేమీ by లేవని నిర్ధారించుకోవటం ముఖ్యం.
ఎవరికయినా గుండె నొప్పి వస్తుందేమోనని
అనుమానముంటే దయచేసి sorbitrate 10mg అనే
టాబ్లెట్ ని ఎల్లప్పుడు దగ్గర ఉంచుకోండి
అందరికి అందుబాటులో ఉండాలని ప్రభుత్వం
వారు దీన్ని 10పైసలకే ఇస్తుంది
కాని సరైన ఆదరణ లేక ఎవరికి తెలియదు
.మెడికల్ షాప్లో కేవలం 2 రూపాయలకేలబిస్తుంది.
గుండె నొప్పి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ ని వెంటనే
నాలిక క్రింద పెట్టుకోండి.క్షణంలో హార్ట్ అటాక్ని
ఆపేసి మరియు 2 గంటలవరకు రానివ్వకుండా
చేస్తుంది.2 గంటల తరువాత మల్లి హార్ట్ అటాక్
రావచ్చు రాకపోవచ్చు .ఆ లోపు హొస్పిటల్ కివెళ్ళి
జాయిన్ అవ్వొచ్చు ఇలా చేస్తే మన ప్రాణాలు
మనమే కాపాడుకోవచ్చు.
Comments
Post a Comment